Pages

Wednesday, June 11, 2008

జడ

ముహుర్తానికి టైం అయిపోతోంది... ఆటోలు వచ్చి చావట్లేదు... ఈ పెళ్ళి హాళ్ళన్నీ ఊరవతల ఎందుకుంటాయో... అసలు ఊరవతల హాళ్ళల్లో పెళ్ళెందుకు పెట్టుకుంటారో... ఎక్కువ మంది రాకూదనేమో....కక్కుర్తి మేళాలు... అయ్యో ... మేళాలంటే గుర్తొచ్చింది... గట్టి మేళం వాయించే సమయానికి నేనక్కడ ఉండి తీరాలి...



అబ్బ... ఎంత ఉక్కగా ఉందో... నా ఖర్మ కాకపోతే వేసవి కాలంలో పెళ్ళి ముహుర్తాలేంటో .. పోనీ కాటన్ బట్టలే కట్టికెళ్దామా అంటే అమ్మో... ఇంకేమన్నా ఉందా... పట్టుచీర బోర్డరు పక్క వాళ్ళ కంటే అరంగుళం చిన్నదిగా ఉన్నా ఎంత చిన్నతనం?



చిన్నతనం అంటే గుర్తొచ్చింది నిజంగా నా చిన్నతనంలో నేనలా చేసుండక పోతే ఈ రోజు నాకీ ఖర్మ ఉండేది కాదు. కానీ ఏం చేస్తాం? చిన్నతనం. చిన్నప్పట్నించీ పెళ్ళంటే అదో పెద్ద పండగ లాగా ప్రొజెక్ట్ చేస్తారు పెద్దవాళ్ళు. మనమేమో అమాయకంగా పెళ్ళనగానే ఎగిరి గంతేసి పట్టు పరికిణీలు కట్టేసుకొని పందిళ్ళ వెంట సిగ్గులేకుండా పరిగెత్తడం... వాళ్ళేమో పిల్లలతో ఎంత కళొచ్చేసిందో అంటూ మెటికలు విరిచేసుకోవడం... అసలు నా దృష్టి లో పెళ్ళంటే చుట్టాలందరూ చేసే శ్రమదానం.



ఎట్టకేలకు ఆటో దొరికింది... ఓ నూట యాభై నావి కావనుకోవాలి. నూట యాభై అంటే గుర్తొచ్చింది పెళ్ళిలో పనిచేసింది కాక నూట పదహార్లు సమర్పించుకోవాలి. ఇంకా ముహుర్తానికి టైం ఉంది. తిరుగుతున్న ఆటో మీటరు నన్ను గతంలోకి తీస్కెళ్ళింది.


అప్పుడు నేను ఇంటర్. నా జీవితాన్ని ఇలా చేసిన పెళ్ళి అది. పెళ్ళికూతురు నాకు అక్క వరస. చెలికత్తె లాగా పెళ్ళికి నెల రోజుల ముందు నుంచీ అక్క చుట్టే తిరిగాను. గౌరీ పూజప్పుడు అక్క మాట్లాడకూడదని నేనే సెక్రటరీగా వ్యవహరించాను. ఆనక ట్రెజరర్ గా గిఫ్ట్ లన్నీ పెద్దమ్మకి అప్పగించాను. సరే ఇంక నా పనులన్నీ అయిపొయాయనుకుంటుంటే మంగళసూత్ర ధారణ అప్పుడు కొంపలంటుకుపోయినట్టు పిలిచారు.. ఏవిటని హడావుడిగా వెళ్తే... జడ పట్టుకోవాలట! పైగా పందిట్లో ఉన్న ముసలి నక్కలు "పట్టుకోవే అమ్మాయి.. తర్వాత పెళ్ళి నీకే" అని నవ్వుకోవడం. ఇదో బోడి ఇన్సెంటివూ.. అలా అని తెలిస్తే ఛస్తే పట్టుకునేదాన్ని కాదు.



ఇక అక్కణ్ణుంచీ మొదలు. పెళ్ళికెళ్తే నన్నే జడ పట్టుకోమనేవారు... ఈ కుట్ర వెనకాల కొన్ని స్వదేశీ వృధ్ధ హస్తాలున్నాయని నా నమ్మకం. నేను జడ పట్టుకున్న పెళ్ళిళ్ళన్నీ శుభంగా సాగుతున్నాయనీ, ఆ దంపతులు శుభ్రంగా కాపరాలు చేస్కుంటున్నారనీ, దానికి వాళ్ళ అదృష్టం, అన్యోన్యత లాంటివి కాక నేనే కారణం అనీ ప్రచారం జరిగింది. అలా జడ నా మెడకి చుట్టుకుంది.



అప్పుడంటే నేను చిన్నపిల్లని. అలా పెళ్ళికి పిలవగానే ఇలా వెళ్ళిపోయేదాన్ని... కానీ ఇప్పుడూ... ఆఫీసులూ, పర్మిషన్లూ, ఓవర్ టైములూ, జీతం కటింగ్ లూ గట్రా. పోనీ ఎగ్గొట్టేద్దామా అంటే "మీ అమ్మ తరఫు వాళ్ళంటేనే నీకు ప్రేమే.. ఏ మీ మేనత్తలూ, బాబాయిల పిల్లలు చక్కగా కాపురాలు చేసుకోవాలని నీకు లేదుటే" అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిళ్ళు!



అసలు నేనిప్పుడు వెళ్తున్న పెళ్ళి ఎవరిదో కూడా నాకు తెలియదు. తగుదునమ్మా అని బయల్దేరాను. మొత్తానికి మండపం వచ్చింది. నన్ను గతంలోకి తీస్కెళ్ళిన ఆటో మీటరు చూపించిన దానికంటే ఓ యాభై ఎక్స్ ట్రా ఇవ్వవలసి వచ్చింది.


మండపం లోపలికెళ్తూ ఒక్కసారి ఊపిరి పీల్చాను. సుశిక్షితురాలైన సైనికురాల్లా ముందుకు కదిలాను. పెళ్ళి కూతురు వెనకే పొజిషన్ తీసుకుని సరిగ్గా గట్టి మేళం మొదలయ్యేటప్పడికి మందుగుండు కూరేప్పుడు ఫిరంగిలా జడ ఎత్తి పట్టుకున్నాను. మంగళ సూత్రధారణ అయ్యింది. అంతటితో ఓ యుధ్ధం ముగిసింది.


నా ఆఫీసులో ఇంకో పర్మిషనూ, నా ఖాతాలో ఇంకో అన్యోన్యమైన కాపురం... నా జమాలో ఇంకో జడ!

6 comments:

Swathi said...

:) :) :) :) :) :) :) :) :)
chaduvutunantasepu naa expression adhi!
Awesome soumya. was engrossed in reading(hehehe, heheehe anukuntu) :)

BADARI said...

Meeru ~jada' lo vyaktam chesina feelings leka bhavaalu...naku chala vidhalu ga vartistayi sowmya garu....maadi pedda kutumbham..chala pellillu..ma naanna gari adhyatyam lo ippati daka padihenu pelillu....naanna ki nenu pedda vadini....nenu lekunda pelillu jaraga vannatlu chuttalantha na..leave plan nu batti muhurtalu peduthunnamani emotional black mails....akhariki maga pellivaryna..adapellivaryna..chivariki nake srama...car driving daggiraninchi...ada pelli vari lanchanalu..ichhe tons of laddlu moyadam daka...birudu,,,veedu military vadu ra...anni cheya galudu..urey abbay next ma ammayi pelli tappakunda ravali nayana ...ani advance invitation...

hey sowmya...your refreshing article made me very nostalgic..of two things....one of our brahmin marriages..where we are expected to rough it out..and second the beautiful..jada ..of my wife whom i miss each moment...write many more....the saprk in you is ignited now ....by the way who is going to hold your jada...in ur marriage

Anonymous said...

జడ పురాణం బావుంది సౌమ్యా! స్వదేశీ వృద్ధ హస్తాలు నిఝ్ఝంగానే ఉంటాయి.ఈ ఒఖ్ఖ జడ ప్రహసనమే చెప్పావు నేనూ!.......ఇప్పుడెందుక్కాని నా పురాణం.మొత్తానికి ఓ మాంఛి బ్లాగు లో మెంబర్ని చేసావు.ధన్యవాదాలు.మరిన్ని వ్రాస్తావని ఎదురుచూస్తున్నాను.

Lalitha said...

though a minuscule gesture of holding jada of the bride ur blog made it noticeable. i was reminiscent of my marriage and watched the CD to see who was holding my jada. we need an occasion to celebrate and let us know your jada holding jubilee counts(silver,diamond,golden.....)hope your jada is long for somebody to hold.

Unknown said...

nee jada puranam peddamma chadivindi. nee gatha kalam looni jadani talachikoni.....adippudu ledani telisi kontha badha padindi mari!!!! Keep Rocking!

Unknown said...

చాలా బాగుందండి... ��